సామాన్యంగా పాశ్చాత్య దృక్పథంలో మత ప్రమేయం లేని ధర్మం అన్నది మతానికి సాక్షాతు విరుద్దమైనది. మతమంటే వారి దృష్టిలో ఒక ప్రవక్త తన అనుచరుల మీద శాసించే విశ్వాసాల పుట్ట. ప్రతి మతమూ కొన్ని విశ్వాసాలను ఆ మతస్థులకు నిర్దేశిస్తుంది. అవి ఎందుకు? అన్న తర్కం లేకుండా వారు వాటిని పాటించాలి. అలా పాటించిన వారికి మోక్షం లభిస్తుందని, లేని వారికి శాశ్విత నరకం ప్రాప్తిస్తుందని ఆ మతస్థులు గాఢంగా నమ్ముతారు. ఆ మతస్థులు నయానో, భయానో ఇతర పలు మార్గాల ద్వారానో ప్రజా బాహుళ్యాన్ని తమ మతంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మతాన్ని వ్యాపింప చేయడమే వారి లక్ష్యం. తమ మతంలో చేరని వారంతా పతితులని, వారందరిని ఉద్దరించటమే తమ ధ్యేయమని వారు చెప్తుంటారు. వారు పునర్జన్మ సిద్దాంతాన్ని నమ్మరు. మానవుడు ఈ లోకంలో చేసిన పాపాలు ఒక క్షమాపనతో సరి అంటారు. హిందూ ధర్మం అటువంటిది కాదు. పునర్జన్మ సిద్ధాంతం విశ్వసించబడుతుంది. పాపాలు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని, పుణ్యాలు, ధర్మాలు చేసినవారు పుణ్యం మూటగట్టుకుంటారని హిందు ధర్మం చెబుతోంది. దీనిలో జనులు మంచి పనులు మాత్రమే చేసే మంచి జీవన విధానం పొందుపర్చబడింది. హిందువుల దృక్పధంలో మతమంటే విశ్వాసాల పుట్ట కాదు. అది ఒక జీవిత విధానం. ఒక అనుభవ విశేషం. వాస్తవాల సమాహారం. పరమాత్మ లక్షితమైన జీవాత్మ అంతరంగం సాధించే అనుభవం అది. హిందూ ధర్మం ప్రయోగాత్మకమైన ప్రాతిపదిక కలది. ఇది మానవ ప్రకృతి ఎంత విశాలమైందో అంత విస్తారమైంది. హిందూ ధర్మం కరుడు కట్టుకొని, అంధ విశ్వాసాలతో ఆగి పోలేదు. ఇతర మతాలపై సద్భానను ప్రకటించటమే కాకుండా గౌరవ భావాన్ని చాటి చెప్పింది. అందరూ ఒకే విశ్వాసాన్ని, ఒకే ఆరాధనామార్గాన్ని అనుసరించాలని హిందూ ధర్మం ఎప్పుడూ చెప్పలేదు. మోక్షానికి ఇదే ఏకైక మార్గమని అనుసరించాలని ఒత్తిడి చేయలేదు. హిందూ ధర్మం ప్రవాహం వంటిది. నిత్య చైతన్య వంతమైనది. కాలానుగుణంగా గతిని మార్చుకున్న దాని శీలం పదిలంగా ఉంది. హిందువులు నూతన ధర్మాలను అధరించి జీవన పధంలో వాటిని పరిశోధిస్తూ వచ్చారు. సత్యాన్వేషణతో ప్రగతిశీలమైన ధర్మాలను సాంప్రదాయాలుగా ఆచరిస్తునే ఉన్నారు. కాబట్టి హిందూ ధర్మానికి మతంతో సంబంధం లేదు - బి.గోపీనాధ్
No comments:
Post a Comment